గుజరాత్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. వడోదర జిల్లా సావ్లీలో హింసాత్మక ఘటనలు జరిగాయి. పండుగ నేపథ్యంలో సావ్లీలోని కూరగాయల మార్కెట్ లోని ఓ విద్యుత్ స్తంభానికి ఓ మతం వారు తమ జెండాను కట్టారు. ఆ స్తంభానికి పక్కనే దేవాలయం ఉంది.
దీంతో మరో మతం వారు అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. తమ మతపరమైన మనో భావాలను దెబ్బ తీశారంటూ ఘర్షణకు దిగారు. దీంతో మాటా మాట పెరిగి అల్లర్లకు దారి తీసింది. దీంతో ఒకరిపై మరొకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు.
ఈ క్రమంలో మార్కెట్ లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీ ఛార్జ్ చేశారు. ఇరు వర్గాల వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ క్రమంలో మార్కెట్ లో భారీగా పోలీసులను మోహరించారు.
రాళ్లదాడిలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన మొత్తం 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోసారి ఎలాంటి ఘటనలు జరగకుండా పట్టణం మొత్తం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.