ఢిల్లీలో హిట్ అండ్ రన్ కేసు హతురాలు అంజలీ సింగ్ అటాప్సీ రిపోర్టు దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. ఈ ఘటనలో కారు ఆమెను సుమారు 12 కి.మీ. దూరం ఈడ్చుకుపోవడంతో ఆమె శరీరంపై 40 చోట్ల గాయాలయ్యాయని, పుర్రె భాగం విచ్చుకు పోగా..వెన్ను విరిగిందని ఈ నివేదిక తెలిపింది. ఆమె శరీరం కారు వెనుక చక్రంలో చిక్కుకుపోయిందని, ఈ ఘటనలో కారు ఆమెను ఈడ్చుకుంటూ సుమారు గంట సేపు ప్రయాణించిందని పేర్కొంది.
అయితే ఆమెపై లైంగిక దాడి జరిగిందనడానికి ఆధారాలు లేవని వివరించింది. ఢిల్లీ శివార్లలో ఒక చోట అంజలి నగ్న మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగిఉండవచ్చునని మొదట భావించినప్పటికీ.. పోస్ట్ మార్టం రిపోర్టులో అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఏమైనా.. తుది నివేదికను త్వరలో రిలీజ్ చేస్తామని స్పెషల్ పోలీసు కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు.
మరికొంత కెమికల్ ఎనాలిసిస్ చేయాల్సి ఉందని, బయాలజికల్ నమూనాల విశ్లేషణ కూడా నిర్వహించాల్సి ఉందని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ బోర్డుకు చెందిన నిపుణులు పేర్కొన్నారు. కుటుంబంలో అంజలి సింగే పెద్దదని, ఆమె తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం మరణించగా.. కుటుంబ పోషణ ఆమెపైనే ఉంటూ వచ్చిందని తెలిసింది.
కనీసం తన కుమార్తె అంత్యక్రియల నిర్వహణకైనా తమ వద్ద డబ్బులు లేవని అంజలీసింగ్ తల్లి వాపోయింది. కారులో ప్రయాణిస్తున్న 5 గురు వ్యక్తులు వాహనంలో పెద్దగా మ్యూజిక్ పెట్టి కేరింతలు కొడుతున్న కారణంగా హతురాలి కేకలు వినలేదని తెలియావచ్చింది. న్యూ ఇయర్ ని పురస్కరించుకుని వీరు బాగా మందు కొట్టి ఉన్నట్టు వెల్లడైంది.