ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా.. ఎవరు చెప్పినా వినడం లేదు. దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా 40 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. అలాగే 10మంది పౌరులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
రష్యాకు దీటైన సమాధానం చెబుతోంది ఉక్రెయిన్ సైన్యం. తమదైన తీరులో ప్రతిఘటిస్తోంది. ఇప్పటికే పలు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించగా.. తాజాగా 50 మంది రష్యా సైనికుల్ని హతమార్చినట్లు తెలిపింది.
రష్యాపై ఎదురుదాడికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించాలనుకుంటున్న పౌరులు ఎవరికైనా ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్ కు మద్దతుగా పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మరోవైపు రష్యాపై ప్రతీకార చర్యలు చేపట్టింది ఉక్రెయిన్. ఆ దేశంతో ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.