ఏపి రాష్ట్ర వ్యాప్తంగా కోళ్లు కత్తులు దూశాయి. కాకినాడ,కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో విచ్చలవిడిగా కోడిపందాలు సాగాయి. వైసీపీ నాయకులే దగ్గరుండి పందాలను ప్రోత్సహించడం…పోలీసుల మీదే కేకలు వేస్తూ పెత్తనం చెలాయించడంతో మిలిగిన వారూ లెక్కచేయని పరిస్థితి ఏర్పడింది.
అమలాపురం మండలం వన్నెచింతపూడిలో జగనన్న లే అవుట్ లో కోడి పందాల బరిని అధికార పక్షం నాయకులు ఏర్పాటు చేశారు.తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, గోకవరంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కోడిపందాలు ప్రారంభించారు. ఆయా వేదికల వద్ద లక్షల్లో పందాలు సాగాయి. తాళ్లరేవు మండలంలో జార్జిపేటలో రాష్ట్ర స్థాయి బరి ఏర్పాటు చేశారు. మంత్రి విశ్వరూప్ కుమారుడు పందాలను వీక్షించారు. ఒక్కో పందం 6 లక్షలతో మొదలైంది. ఇక్కడ గుండాటను పోలీసులు అడ్డుకున్నా.. కోడిపందాలు ఆగలేదు.
కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వెదురేశ్వరం రోడ్డులో కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పోలీసులపై విరుచుకు పడడం చర్చనీయాంశమైంది. ఇక కోడి పందాల కోసం కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలిలో లెక్కింపు యంత్రాల ద్వారా పందాల నగదు లావాదేవీలు సాగాయి. భీమవరం మండలం డేగాపురం, ఆకివీడు మండలం దుంపగడపలో శుక్రవారం దాకా కబడ్డీ పోటీలు జరిపితే.. అదే ప్రాంగణం కోడి పందాలకు వేదికైంది.
నిడమర్రు,సీసలి, డేగాపురంలో డిజిటల్ స్క్రీన్లలో పందాలు వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఒక్కో పందానికి బరిలో 10 లక్షల రూపాయలు నుంచి 50 లక్షల రూపాయల దాకా బెట్టింగులు సాగాయి. ఇక ఒక్కో బరిలో కోటి వరకు కూడా చేతులు మారాయి. పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు కిక్కిరిశాయి. కైకలూరు మండలం చటాకాయ్ గ్రామంలో కోడిపందాల బరిలో రెండు కోళ్లూ నెగ్గినట్లు ప్రకటించడంతో వివాదం తలెత్తింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో భోగి రోజు వేసిన పందాలు,జూదాలు అన్నీ కలిసి దాదాపు 400 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.