మహారాష్ట్ర రాజకీయాలు ఇంట్రస్టింగ్ గా కొనసాగుతున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఏమాత్రం తగ్గడం లేదు. అసోం గౌహతిలోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న వారంతా.. తాజాగా తమ బల ప్రదర్శన చేశారు. మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేతో కలిసి వీడియో విడుదల చేశారు.
42 మంది ఎమ్మెల్యేల్లో 35 మంది శివసేనకు చెందినవారు కాగా.. మిగిలిన ఏడుగురు ఇండిపెండెంట్స్. వీడియోలో షిండే సాబ్ తుమ్ ఆగే బడో.. హమ్ తుమ్హారే సాత్ హై అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు.
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఏక్ నాథ్ షిండే ఎమ్మెల్యేలతో కలిసి గౌహతిలో మకాం వేశారు. గురువారం ఉదయం కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా హోటల్ కు చేరుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం తమపై చర్యలు తీసుకోకుండా వీరంతా మెజార్టీని నిరూపించుకునేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
ఇటు శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ ముందు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అసోం సీఎం మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మద్దతుగా ఉంటూ.. స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు టీఎంసీ కార్యకర్తలు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అసోం మంత్రి అశోక్ సింఘాల్.. ర్యాడిసన్ బ్లూ హోటల్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ తాజా పరిణామాలపై స్పందించారు. అసోం వరదలతో అల్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. వరదలతో కుదేలైన అసోంను సందర్శించి ప్రత్యేక ప్యాకేజ్‌ను ప్రకటించాల్సిన ప్రధాని.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడంలో, గుజరాత్ ఎన్నికల్లో నిమగ్నమయ్యారని ఫైరయ్యారు. బీజేపీ అధికార దాహంతో ఉందని.. ఆ పార్టీకి అధికారమే ముఖ్యమని ఆరోపించారు.