భారత్ లోకి మాదకద్రవ్యాలు తరలిస్తున్న ఇరాన్ దేశస్థులను భారత కోస్టు గార్డు అడ్డుకుంది. వారి పడవలో 61 కేజీల హెరాయిన్ లభ్యమైనట్లు తెలిసింది. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 425 కోట్లు ఉంటుందని సమాచారం. మరో వైపు బెంగాల్ లో 40 కేజీల బంగారాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది.
కెన్యా ప్యాసింజర్ బంగారం అక్రమ రవాణా చేస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో దొరికిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే హెరాయిన్ పట్టివేతకు సంబంధించి నిఘా వర్గాల నుంచి అందిన ఖచ్చితమైన సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్ నిర్వహించామని రక్షణ శాఖ ప్రజా సమాచార విభాగం ప్రకటించింది. మాదకద్రవ్యాల రవాణా గురించి గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ సమాచారం ఇచ్చిందని పేర్కొంది.
దీంతో కోస్టు గార్డు అధికారులు వెంటనే స్పందించారని తెలిపింది. రెండు ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ షిప్ లను పెట్రోలింగ్ కోసం రంగంలోకి దించారని తెలిపింది. అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా కనిపించే పడవలపై కోస్టు గార్డు నిఘా పెట్టినట్లు వెల్లడించింది. మరో వైపు సరిహద్దు భద్రతా దళం బెంగాల్ లోని నదియా జిల్లాలో 2.57 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
40 బంగారు బిస్కెట్లు ఓ నీటి కుంటలో లభ్యమయ్యాయని తెలిపింది. తమకు అందిన పక్కా సమాచారంతో వీటి కోసం వెతికినట్లు పేర్కొంది. కల్యాణీ సరిహద్దు అవుట్ పోస్ట్ కు సమీపంలోని కుంటలో ఇవి కనిపించాయని వెల్లడించింది. కొద్ది నెలల క్రితం ఓ స్మగ్లర్ వీటిని అందులో దాచిపెట్టాడని బీఎస్ఎఫ్ తెలిపింది.