పాక్ లో ఇటీవల ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆయన్ని పదవి నుంచి తొలగించారు. అయితే ఇమ్రాన్‌ఖాన్ తొలగింపుపై ప్రజల ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకునేందుకు గాలప్ పాకిస్తాన్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది.
దాని ప్రకారం ఇమ్రాన్ ను పదవి నుంచి తొలగించినందుకు 43 శాతం మంది ప్రజలు సంతోషంగా లేరని సర్వే తెలిపింది. మిగిలిన 57 శాతం మంది ప్రభుత్వం నుంచి ఖాన్ వైదొలగడం పట్ల సంతోషంగా ఉన్నట్లు వెల్లడైంది.
విశ్వాస పరీక్ష జరిగిన వెంటనే శనివారం 100 జిల్లాల్లో 1,000 మంది పురుషులు, మహిళలపై సంస్థ సర్వే నిర్వహించింది. ఇమ్రాన్ ఖాన్ తొలగింపుపై అసంతృప్తిగా ఉన్నవారు ఇప్పటికీ ఆయన్ని నిజాయితీగల రాజకీయవేత్తగా పరిగణిస్తున్నట్టు నివేదిక తెలిపింది.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఇమ్రాన్ ఫెయిల్ అయ్యాడనీ, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విఫలం అయిందన్న కారణంగా మిగిలిన వారు ఇమ్రాన్ ఖాన్ పై చాలా కోపంగా ఉన్నట్టు సర్వే పేర్కొంది.
ఇమ్రాన్ ఖాన్ పై ఇటీవల అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ డిప్యూటీ స్పీకర్ దాన్ని తిరస్కరించారు. దాంతో ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఈ నెల 10న ఓటింగ్ నిర్వహించగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 174 ఓట్లు వచ్చాయి. దీంతో పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగాడు.