జమ్మూ కశ్మీర్, లడఖ్..రెండు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య చిక్కుబడిపోయిన మొత్తం 438 మంది ప్రయాణికులను నిన్న విమానాల ద్వారా తరలించారు. వీరిలో చాలామంది జమ్మూలో చిక్కుకుపోయారు . ఇక్కడినుంచి కార్గిల్ కు, శ్రీనగర్ నుంచి లేహ్ కు వారిని తరలించారు.
434 కి.మీ. శ్రీనగర్-లేహ్ నేషనల్ హైవేని మూసివేయడంతో వీరంతా రోడ్డు మార్గం లేక ఈ ప్రాంతాల్లో చిక్కుబడిపోయారు. 260 మందిని శ్రీనగర్ నుంచి లేహ్ కి, 165 మందిని జమ్మూ నుంచి కార్గిల్ కి, 13 మందిని కార్గిల్ నుంచి జమ్ముకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు.
ఓవైపు దట్టమైన మంచు, మరో వైపు రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రయాణికులంతా నానా హైరానా పడ్డారు.
గతంలో కూడా చాలాసార్లు ఇలా విద్యార్థులను, ఇతరులను విమానాల ద్వారా తరలించినట్టు అధికారులు చెప్పారు. అనివార్య కారణాల వల్ల శీనగర్-లేహ్ జాతీయ రహదారిని మూసివేయాల్సివచ్చిందన్నారు.