దేశ విభజన జరిగి 75 ఏళ్ళు అయిందని, ఇప్పుడు తిరిగి పాకిస్తాన్ ను ఇండియాలో విలీనం చేయాలనీ 44 శాతం మంది భారతీయులు కోరుతున్నారు. 1947 లో దేశ విభజన జరిగింది. అనంతరం భారత-పాకిస్తాన్ దేశాల్లో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. అలాగే బంగ్లాదేశ్ లో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిఓటర్-సీపీఆర్ సంస్థలు సర్వే నిర్వహించగా 44 శాతం మంది భారతీయులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పాక్ ప్రభుత్వాన్ని నమ్మవచ్చునని 14 శాతం మంది చెబితే.. 60 శాతం మంది బంగ్లాదేశ్ వైపు మొగ్గు చూపారు. సెంటర్ ఫర్ ఓటింగ్ ఒపీనియన్ అండ్ ట్రెండ్స్ ఇన్ ఎలెక్షన్ రీసెర్చ్ , సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్ సంస్ధలు గత మే-సెప్టెంబరు మధ్య ఈ మూడు దేశాల్లో 15 భాషలను ఉపయోగించి సర్వే నిర్వహించాయి. దీని నివేదికను గత నెలలో విడుదల చేశాయి. 5,815 మంది భారతీయులను .. రాజకీయ, ఆర్ధిక, సామాజిక, మతపరమైన అంశాల మీద అడిగిన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలివి.
ఇండియాలోని ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగాల పరిస్థితి, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ వంటి అంశాలపై కూడా ఈ సంస్థలు ప్రశ్నలను సంధించాయి, భారత దేశంలో గత పదేళ్లలో ప్రజాస్వామ్యం బలోపేతమైందని 48 శాతం మంది ఇండియన్స్ చెప్పారు. దేశంలో ఇప్పుడు నియంతృత్వ పోకడలు లేవని సుమారు 51 శాతం మంది అభిప్రాయపడితే.. కొంతవరకు ఈ ధోరణి ఉందని దాదాపు 31 శాతం మంది చెప్పారు. భారత-పాకిస్థాన్ దేశాల విభజన అప్పట్లో సరైనదేనని 46 శాతం మంది.. భావిస్తే.. పాక్.. బంగ్లాదేశ్ విభజన కరెక్టేనని 44 శాతం మంది పేర్కొన్నారు.
అసలు విభజన తప్పని గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా వంటి రాష్ట్రాల్లోని ప్రజలు విమర్శించారు. 55 ఏళ్ళ వయస్కుల్లో 30 శాతం మంది 1947 నాటి విభజనను సమర్థించగా .. అది తప్పని 57 శాతం మంది అన్నారు. ఇండియాలో మౌలిక సదుపాయాలు బాగానే ఉన్నాయని 70 శాతం మంది అగ్రవర్ణ హిందువులు, ఓబీసీలు, ఎస్టీలు పేర్కొన్నారు. అయితే మైనారిటీలకు చెందినవారిలో 60 శాతం మంది.. ఎస్టీల్లో 47 శాతం మంది దేశంలో ఈ సదుపాయాలు తాము ఆశించినట్టుగా లేవన్నారు. ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు నిరాశగా స్పందించారు. దేశ ఆర్ధిక పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయని 53 శాతం మంది ముస్లిములు చెప్పారు.