భూకంపాలతో టర్కీ అల్లాడి పోతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 30వేలకు చేరుకుంది. లక్షలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో వైపు సిరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. రెండు దేశాల్లో ఎటు చూసినా శిథిలాలు, శవాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
టర్కీ, సిరియాలో ఎటు చూసినా విషాధ ఛాయలు కనిపిస్తున్నాయి. ఓ వైపు తమ వాళ్లను కోల్పోయి కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగిపోగా మరో వైపు దొంగలు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని రెచ్చి పోతున్నారు. టర్కీలో దోపిడీలకు పాల్పడుతున్నారు.
దక్షిణ ప్రాంతమైన హటే ప్రావిన్స్‌లో దోపిడికి పాల్పడుతున్న 42 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు గాజియాంటెప్‌లో మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న వారిని స్థానికులు పట్టుకుని కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు భూకంపం నేపథ్యంలో ఆగ్నేయ టర్కీలోని 10 ప్రావిన్సుల్లో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధించారు. దీనిలో భాగంగా దోపిడీలకు పాల్పడుతున్న వారిని అదనంగా మరో మూడు రోజుల పాటు నిర్భంధించవచ్చని ఆ ప్రకటనలో వెల్లడించారు.
గతంలో నిందితులను ప్రాసిక్యూటర్ల నాలుగు రోజలు నిర్భంధించే అవకాశం మాత్రమే ఉండేది. టర్కీలో దోపిడీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన వెల్లడించారు. దోపిడీలు, కిడ్నాప్ లకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు.