గత ప్రభుత్వాలలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇన్నాళ్లలో 48 గంటల ముందస్తు అరెస్టులను ఎన్నడూ చూడలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ధ్వజమెత్తారు. పోలీసులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారన్నారు. బీజేపీ శ్రేణులను చూస్తుంటే బీఆర్ఎస్ కు ఎందుకంత భయం పుట్టుకొస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ,మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, విజయరామరావు మాట్లాడుతూ.. తమ కార్యకర్తలు అంటే ఎందుకు అంత భయమని అడిగారు. బీజేపీ కార్యకర్తలకు ఎలాంటి హాని కలిగినా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లదే బాధ్యత అని హెచ్చరించారు. పదే పదే ప్రతిపక్షాల శ్రేణులను పోలీసుల చేత అరెస్ట్ చేయించడం కేసీఆర్, కేటీఆర్ అహంకారధోరణికి నిదర్శమని అన్నారు.
కేసీఆర్,కేటీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఇక ఇలా ఉంటే బీజేపీ కార్యకర్తలను తెల్లవారు జామున 4 గంటలకు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. కేటీఆర్ టూర్ నేపథ్యంలో వందలాది మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం పై ఎమ్మెల్యే ఈటల మండిపడ్డారు. మంత్రి వస్తే అరెస్ట్ చేయాలా.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని ఫైర్ అయ్యారు.
అయితే హన్మకొండ జిల్లా కమలాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇక కేటీఆర్, కేసీఆర్ జిల్లా పర్యటనల నేపథ్యంలో కాంగ్రెస్,బీజేపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. అయినా కాని ఏదో ఒక రూపంలో నిరసన సెగ మాత్రం కేసీఆర్, కేటీఆర్ లకు తప్పడం లేదు. దీంతో పోలీసులు 48 గంటల ముందే అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. మరో వైపు కాంగ్రెస్, బీజేపీలు ఈ తీరుపై మండిపడుతున్నాయి.