క్రికెట్ రంగ చరిత్ర కొత్త మలుపు తిరుగుతోంది. అంతర్జాతీయ క్రికెటర్లు ఫ్రీలాన్స్ ‘ఏజెంట్లు’గా మారేందుకు తమ తమ దేశాల సెంట్రల్ కాంట్రాక్టులను తిరస్కరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ 20 లీగ్ మ్యాచుల్లో ఆడేందుకు తమ దేశాల సెంట్రల్ కాంట్రాక్టులను తోసిపుచ్చే విషయాన్ని దాదాపు 49 శాతం మంది క్రికెటర్లు యోచిస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అయితే ఈ సర్వేలో భారతీయ క్రికెటర్లు లేరు. బీసీసీఐకి .. ఈ అసోసియేషన్ లో సభ్యత్వం లేదు.
దేశీయ లీగ్ మ్యాచ్ లలో ఎక్కువ చెల్లింపు జరిగినా ఆ కాంట్రాక్టును తిరస్కరించాలని ఇంటర్నేషనల్ క్రికెటర్లు భావిస్తున్నారట. ప్రపంచంలోని 100 మంది టాప్ టీ 20 ప్లేయర్లల్లో 80 శాతం మందికి పైగా ‘టీ 20 మ్యాచ్ ‘ ల పరిధిలో లేరని ఈ నివేదిక పేర్కొంది.
ఇండియా, పాకిస్థాన్ తప్ప ఇతర 11 దేశాలకు చెందిన సుమారు 400 మంది ఆటగాళ్లను తాము సర్వే చేశామని, వీరిలో 49 శాతం మంది తాము ‘ఫ్రీ ఏజెంట్లు’ గానే వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలిపారని ఈ నివేదిక వెల్లడించింది.
మరో 42 శాతం మంది ‘హైబ్రిడ్’ మోడల్ ని ఎంచుకున్నారట. అంటే విదేశాల్లో నిర్వహించే కనీసం ఒక్క టీ 20 లీగ్ తో బాటు నేషనల్, డొమిస్టిక్ కాంట్రాక్టుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సర్వే నివేదిక మాత్రం దిగ్భ్రాంతికరమైన విషయాలను బయట పెట్టింది. అయితే ఈ ‘జాబితాలో’ భారత క్రికెటర్లు లేకపోవడం విశేషం.