ప్రీతి మృతితో జనగామ జిల్లా గిర్నితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారీ భద్రత నడుమ ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ప్రీతి డెడ్ బాడీ చూసిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్రీతి మృతికి కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 90 రోజులలోపు నిందితుడికి శిక్ష విధించాలని కోరుతున్నాయి. బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాయి. ఆందోళనల నేపథ్యంలో ప్రీతి స్వగ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే, మరో రూ.20 లక్షల పరిహారాన్ని కూడా అనౌన్స్ చేశారు. ప్రీతి ఘటన అత్యంత బాధాకరమని నిందితుడిని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టబోమని ఎర్రబెల్లి సహా ఇతర మంత్రులు వెల్లడించారు.
ప్రీతీని బతికించేందుకు 5 రోజులుగా నిమ్స్ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం రాత్రి 9.10 గంటలకు ఆమె చనిపోయింది. ఈనెల 22న కేఎంసీలో సీనియర్ వేధిస్తున్నాడని.. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే.. ఇది ఆత్మహత్య కాదని.. సైఫ్ ఇంజక్షన్ చేసి చంపేశాడని అంటోంది బాధిత కుటుంబం.