లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 5 రోజుల సిబిఐ కస్టడీకి రౌజ్ ఎవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. మార్చ్ 4 వరకు ఆయన సిబిఐ కస్టడీలో ఉంటారు. కోర్టులో సిసోడియా తరఫున వాదించిన లాయర్ .. తన క్లయింట్ అరెస్ట్ మెమోకు లేదా రిమాండ్ దరఖాస్తుకు తగిన కారణాలు లేవన్నారు. గత ఏడాది మే లో లిక్కర్ పాలసీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోద ముద్ర వేశారని, కానీ ఆయన చేసిన సూచనలను దాచి పెట్టేందుకు సిబిఐ యత్నిస్తోందని ఆ లాయర్ ఆరోపించారు.
పాలసీ అమలుకు ముందు వాటిని ఆమోదించడం కూడా జరిగిందన్నారు. తమ పార్టీ నేత సిసోడియా అరెస్టుపై స్పందించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. తమ పార్టీ సాధించిన విజయాలపై అసూయ చెందిన బీజేపీ.. ఇలాంటి కక్ష పూరిత చర్యలకు దిగుతోందని ఆరోపించారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీజేపీ నియంతృత్వ పోకడ త్వరలో అంతమవుతుందని ఆయన చెప్పారు.
సిసోడియాను తమ కస్టడీకి కోర్టు అనుమతించిన అనంతరం సిబిఐ అధికారులు ఆయనను తమ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. సిసోడియా అరెస్టును కేరళ సీఎం పినరయి విజయన్ ఖండించారు.
విపక్షాలను భయపెట్టేందుకు బీజేపీ… కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా వినియోగించుకుంటోందనడానికి ఇదొక నిదర్శనమన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడేనని ఆయన అభివర్ణించారు. ఈ విధమైన అణచివేత విధానాలను ప్రతిఘటించవలసిన అవసరం ఉందని ఆయన ట్వీట్ చేశారు.