ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. అలీపూర్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న గోడౌన్‌లో గోడ కూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇప్పటి వరకు 10 మందిని రక్షించినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారిలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. ప్రమాద సమయంలో 30 నుంచి 35 మంది వరకు పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
గోడౌన్ 5000 చదరపు అడుగుల స్థలంలో నిర్మిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12.42 గంటల ప్రాంతంలో వేర్ హాజ్ గోడ ఒక్కసారిగా కూలిపోయినట్టు చెప్పారు. ఘటనపై సమాచారం అందడంతో ఐదు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నట్టు ఫైర్ అదికారులు వివరించారు.
ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అలీపూర్‌లో చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుందని ట్వీట్ చేశారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని ట్వీట్ లో పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.