మిస్ యూనివర్స్ పోటీల్లో విశాలమైన కళ్లు, ముఖం మీద ఎప్పుడు చెరగని చిరునవ్వు.. కళ్లను కట్టిపడేసే అందం… దక్షిణాది నుంచి భారతదేశం ప్రతినిధిగా మిస్ యూనివర్స్ పోటీలకు హాజరయ్యింది దివితా. కొద్ది రోజుల క్రితం వరకు ఆమె గురించి కేవలం కర్ణాటక వాసులకి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు దేశమంతా ఆమె ఎవరో తెలుసుకోవడం కోసం సెర్చింగ్ మొదలు పెట్టేశారు.
దివితా రాయ్‌ది కర్ణాటకలోని మంగళూరు. 1998 జనవరి 10న పుట్టింది.ఈమె కుటుంబం ముంబైలో స్థిరపడింది. ముంబైలోని సర్ జెజె కాలేజ్ ఆర్కిటెక్కర్లో చదివింది. చిన్నప్పట్నించి తన అందం మీద నమ్మకం ఎక్కువ. అందుకే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనమని సలహాలు రావడంతో ప్రయత్నించింది.
2019లో ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు అర్హత సాధించింది. 2021లో కూడా మిస్ దివా, మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఆ పోటీల్లో హర్నాజ్ కౌర్ సంధు గెలవడంతో ఈమె రన్నరప్‌గా మిగిలింది. 2022లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో నిలిచింది. ఈసారి దివితా రాయ్ విజేత అయింది. దీంతో మనదేశం తరుపున ప్రపంచ స్థాయిలో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది.
మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాక అందాన్ని కాపాడుకోవడమే పెద్ద సవాలు. తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.అలాగే బరువు పెరగకుండా, ఒంపుసొంపులు కరిగిపోకుండా నిత్యం వ్యాయామం చేయాలి. ఈ పనులన్నీ చేస్తూనే ఆమె ఖాళీ సమయంంలో బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, పెయింటింగ్ వంటివి చేస్తుంది.
పాటలు వినడమన్నా చాలా ఆసక్తి. ఈమె సామాజిక సేవకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. క్యాన్సర్ చికిత్స కోసం వేచిచూస్తున్న పిల్లల కోసం నిధులు సేకరించి ఇచ్చింది. నోటి పరిశుభ్రతపై కూడా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.