ఉత్తరప్రదేశ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్‌లోని దేహాత్ ప్రాంతంలో ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. గుడిసెలో వున్న ఐదుగురు సజీవదహనమయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
హర్మౌ బంజారా డేరా గ్రామంలో ఓ గుడిసెలో నిన్న ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే భారీగా మంటలు వ్యాపించాయి. దాన్ని గుర్తించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు పెద్దగా ఎగసి పడటంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. కానీ అప్పటికే గుడిసెలో వున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను సతీశ్ కుమార్, ఆయన భార్య కాజల్, వారి ముగ్గురు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.