ఇండియా – దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ లో భాగంగా గౌహతి వేదికగా రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు తన ఖాతాలో వేసుకుంది.
టీ20 క్రికెట్‌లో భారత్‌కు ఇది నాలుగో అత్యధిక స్కోరుగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జవాబుగా దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 221 పరుగులకే పరిమితమైంది. దీంతో 16 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది.
సౌతాఫ్రికా తరపున డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్‌తో సెంచరీ(106 పరుగులు) చేయగా, డికాక్ 69 పరుగులతో అజేయంగా నిలిచారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 16 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
దక్షిణాఫ్రికాతో భారత్‌లో తొలిసారిగా టీ20 సిరీస్‌ను రోహిత్ సేన కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య తొలి టీ20 సిరీస్ 2015లో భారత్‌లో జరిగింది. అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. అతను దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా, రిలే రస్సో ఇద్దరినీ డకౌట్ చేశాడు.
భారత్ టాప్ 4 బ్యాట్స్ మెన్ అద్భుతంగా ఆడి మంచి స్కోరు చేశారు. కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అదే సమయంలో రోహిత్ శర్మ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. 28 బంతుల్లో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో 49 పరుగులు వచ్చాయి. వీరే కాకుండా సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. కేవలం 22 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 277.27గా నిలిచింది. అతని బ్యాట్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
మ్యాచ్ సందర్భంగా ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ముగిసే సరికి ఓ పాము మైదానంలోకి వచ్చింది. దీంతో మ్యాచ్‌ను 10 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. కొంత సేపటికి గ్రౌండ్ స్టాఫ్ పామును బయటకు పంపడంతో ఆట మొదలైంది.