జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కథువా జిల్లాలో ఓ మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కౌగ్ నుంచి డానీ పెరోల్‌కు మినీ బస్సు వెళ్తోంది. బస్సు సిలా గ్రామంలోని బిలావర్ ధను పరోల్ వద్దకు రాగానే బస్సు అదుపు తప్పింది. దీంతో పక్కనే ఉన్న లోయలోకి బస్సు దూసుకుపోయింది.,
ఈ ప్రమాదంలో మహిళతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను బిలావర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా యంత్రాగాన్ని ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు.