రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాల్వార్ లోని అఖోడియా గ్రామంలో జాతీయ రహదారి-52పై కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..
మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు వ్యక్తులు రాజస్థాన్ లోని జాల్వార్ బాలాజీ ఆలయానికి కారులో వెళ్లారు. అక్కడ దైవదర్శనం చేసుకుని మధ్యప్రదేశ్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. అఖోడియా గ్రామ సమీపంలోకి రాగానే అటుగా వస్తున్న ట్రక్కు ఒకటి కారును ఢీ కొట్టింది.
దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ట్రక్కు కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న మరో ముగ్గురు మృతి చెందారు. ఆ ముగ్గురు పరీక్ష రాసేందుకు బైక్ పై వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. గాయాల పాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయాల పాలైనవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.