విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను స్టైరీన్ విషవాయువు లీకైన ఘటనపై సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ నిపుణుల బృందం కేంద్రానికి నివేదిక సమర్పించింది. గత కొన్నిరోజులుగా పర్యటించిన ఈ బృందం కేంద్రానికి పలు సిఫారసులు చేసింది. నిపుణులు పరిశ్రమ సమీపంలోని రోడ్లు, నివాసాల్లో స్టైరీన్ అవశేషాలను గుర్తించారు. ఓ ఇంట్లో అత్యధికంగా 1.7 పీపీఎం పరిమాణంలో స్టైరీన్ ను గుర్తించినట్టు నివేదికలో పేర్కొన్నారు.
నివాసాలను పూర్తిగా శుభ్రపరిచాకే ప్రవేశించాలని స్పష్టం చేశారు. స్టైరీన్ ప్రభావానికి గురైన వారు ఏడాదిపాటు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విషవాయు ప్రభావానికి గురైన 5 గ్రామాల్లోనూ, పరిశ్రమ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోనూ పండిన కూరగాయలు, పండ్లను వినియోగించరాదని తెలిపారు. ఇదే పరిధిలోని గ్రాసాన్ని కూడా పశువులకు అందించవద్దని తెలిపారు.