ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులను త్వరలోనే ఆమోదిస్తామని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది. ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయమూర్తులకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని డిసెంబర్‌లో కొలీజియం సిఫారసులు చేసింది.
అత్యున్నత న్యాయస్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తి సహా మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ప్రస్తుతం న్యాయస్థానంలో 27 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. జాబితాలోని ఆ ఐదుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేస్తే సుప్రీం కోర్టులో జడ్జిల సంఖ్య 32కు చేరుతుంది.
న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పదోన్నతిపై త్వరలో స్పష్టత వస్తుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించిన సిఫార్సులను క్లియర్ చేయడంలో కేంద్రం జాప్యం చేయడంపై బెంచ్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది చాలా చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొంది. అసౌకర్యంగా ఉండే నిర్ణయాలు తాము తీసుకునేలా చేయవద్దని పేర్కొంది.