తిరుపతి: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గంగవరం మండలం మామడుగు సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఐదుగురూ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను డీకొని పల్టీలు కొట్టిందని, కారులోంచి మంటలు చెలరేగి అందులో వున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారని అంటున్నారు. ఇదే ప్రమాదంలో మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారు తిరుపతికి చెందిన పావనరాయ్, కళావతి, జాహ్నవి, భానుతేజ, సాయి అశ్రితగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన విష్ణును పలమనేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు మంటల్లో తగలబడిపోతున్న దృశ్యాన్ని చూసేందుకు అక్కడికి చుట్టుపక్కల జనం తండోపతండాలుగా వచ్చారు.