ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం మొదలైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసోం, పశ్చిమ బెంగాల్‌లో దశలవారీగా పోలింగ్ నిర్వహిస్తున్న ఎన్నికల సంఘ.. ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రం ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల దాకా కొనసాగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా.. పకడ్బందీ చర్యలు తీసుకుని పోలింగ్ కు సిద్ధమయ్యారు అధికారులు.
ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు రాజకీయాలే అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. మొదటిసారి జయలలిత, కరుణానిధి లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాగైనా హ్యాట్రిక్ సక్సెస్ సాధించి చరిత్ర సృష్టించాలని అన్నాడీఎంకే భావిస్తోంటే.. ఈసారి ఎలాగైనా అధికారలోకి రావాల్సిందేనని డీఎంకే డిసైడైపోయింది. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ కనిపిస్తున్నప్పటికీ.. కమల్ మక్కల్ నీది మయ్యం, దినకరన్ ఏఎంఎంకే పార్టీలు ఎవరి ఓట్లను చీల్చుతాయి..ఎంతవరకు సత్తాచాటుతాయనేది ఆసక్తిరేపుతోంది.
అటు టర్మ్‌కో గవర్నమెంట్‌ను అధికారంలో నిలబెడుతున్న కేరళ ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందన్నది ఉత్కంటగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చి సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ చరిత్రను తిరగరాస్తుందా.. లేక సాంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ పవర్‌లోకి వస్తుందా అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈసారి మెట్రోమ్యాన్ శ్రీధరన్ నేతృత్వంలో బీజేపీ కూడా తమ అదృష్టాన్ని గట్టిగానే పరీక్షించుకుంటోంది.
పుదుచ్చేరిలోనూ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో కూడిన ఎస్‌పీఏ, ఎన్డీయే కూటములు అధికారం కోసం పోటీపడుతున్నాయి. మొన్నటివరకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అయితే ఆ పార్టీ సభ్యుల్లో కొందరు రాజీనామా చేయడంతో మధ్యలోనే సర్కార్ కూలిపోయింది. ఇందుకు కారణం బీజేపీనే గట్టిగా భావిస్తున్న కాంగ్రెస్.. ఎలాగైనా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుని ఆ పార్టీపై రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తోంటే.. ఈసారి పుదుచ్చేరిలో కమలం జెండా ఎగరేయాల్సిందేనని బీజేపీ కసిగా ఉంది.
పశ్చిమ బెంగాల్‌లో నేడు మూడో దశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 31 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అటు అసోంలో చివరి విడత పోలింగ్ జరుగుతుండగా.. 40 స్థానాల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు.