సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గతకొంత కాలంగా మన జవాన్లు ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా జమ్ము కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో సైనికులు ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టారు.
కశ్మీర్లోని బుడ్గాం జిల్లాలోని చరర్ ఐ షరీఫ్ ప్రాంతంలో, పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో ఉగ్రమూకలకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో మొత్తం ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో మృతుల్లో జైషే మహమ్మద్ కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నాడు.
ఈ ఎన్కౌంటర్ దాదాపు 12 గంటలపాటు జరిగిందని జమ్ముకశ్మీర్ పోలీసులు చెప్పారు. ఇందులో ఐదుగురు ముష్కరులు హతమయ్యారని.. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఏకే-56 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతులు జేఈఎం, ఎల్ఈటీ ఉగ్రవాద సంస్థలకు చెందినవారని అన్నారు.
మృతుల్లో జేఈఎం కమాండర్ జాహిద్ వానీ ఉన్నాడని.. ఎప్పటి నుంచో వానీ టార్గెట్ గా ఆపరేషన్ కొనసాగుతోందని.. ఇప్పుడు వాని హతం కావడం తమకు పెద్ద విజయం అని కశ్మీర్ జోన్ పోలీసులు చెబుతున్నారు.