పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు నెలకొనడంతో తృణమూల్ కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాకర్షక పథకాలకు తెరతీసింది. అచ్చు తమిళనాడులోని రాజకీయ పార్టీల మాదిరిగానే హామీల వర్షం కురిపించింది. రైతులకు ఇప్పటిదాకా అందుతున్న పెట్టుబడి సాయాన్ని పెంచడంతో పాటు.. మహిళలకు నెలా నెలా నగదు సాయం, విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం సులువుగా రుణ సదుపాయం వంటి అంశాలను మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చింది. దాదాపు 10 అంశాలతో ఓటర్లను ఆకట్టుకునే ఓ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ విడుదల చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే.. రైతులకు ఇప్పటివరకు ఎకరాకు ప్రతి ఏడాది అందిస్తున్న రూ. 6వేల సాయాన్ని రూ.10వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో తృణమూల్ కాంగ్రెస్ చేర్చింది. ఇక ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు క్రెడిట్ కార్డు ఇస్తామని ఆఫర్ చేయడంతో పాటు.. 4 శాతం వడ్డీకే రూ. 10 లక్షల వరకు రుణం అందజేస్తామని ప్రకటించింది. ఇక పశ్చిమ బెంగాల్‌లోని 1.6 కోట్ల మంది మహిళలకు నెల నెలా నగదు సాయం అందించే కార్యక్రమాన్ని కూడా మేనిఫెస్టోలో ప్రధన అంశంగా చేర్చింది. అయితే జనరల్ కేటగిరీ మహిళలకు నెలకు రూ. 500 ఇవ్వాలని నిర్ణయించగా.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకైతే రూ.1000 అందజేస్తామని ప్రకటించింది. రేషన్‌ను ఇంటికే అందించే ఏర్పాటు చేస్తామని మమత చెప్పారు.
ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చింది తృణమూల్ కాంగ్రెస్. రాబోయే 5 ళ్లలో 10 వేల పెద్దతరహా పరిశ్రమలు, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏటా 10 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. వీటితో పాటు 24 గంటల విద్యుత్, రెసిడెన్షియల్ స్కూళ్ల పెంపు, చౌర ధరలో ఇళ్ల నిర్మాణం, ఇంటింటికి తాగునీటి సదుపాయం కల్పిస్తామని మేనిఫెస్టోలో చేర్చింది దీదీ.