అవిశ్వాస తీర్మానం దగ్గరకు వస్తున్న సమయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పార్టీకి చెందిన 50 మంది మంత్రులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 50 మంది మంత్రులు బయట కనిపించడం లేదని తెలుస్తోంది.
వీరిలో 25 మంది దాకా ఫెడరల్, ప్రొవిన్షియల్ సలహాదారులు, ప్రత్యేక సహాయకులు ఉన్నట్టు పాక్ మీడియా పేర్కొంది. వీరితో పాటు నలుగురు రాష్ట్ర మంత్రులు, 19 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నట్టు వెల్లడించింది.
దేశంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఇమ్రాన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన ప్రభుత్వంపై ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సమయంలో కొంతమంది ఎంపీలు పార్టీ మారితే ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోతుంది.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కు మిత్ర పక్షాల, దాదాపు 25 మంది ఎంపీల తిరుగుబాటు ఎదురవుతోంది. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వం కూలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అలాంటిదేదీ లేనట్టు, అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని, తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ పండితులు చెబుతున్నారు.