నకిలీ పత్రాలతో బ్యాంకులతో పాటు కంపెనీలను మోసం చేస్తున్న ఓ వ్యాపార సంస్థ డైరెక్టర్ ను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. సనత్ నగర్ కు చెందిన వ్యాపారి కే.సంతోష్ రెడ్డి కంపాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ ప్రై. లిమిటెడ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఆ కంపెనీలో అతను సివిల్ కాంట్రాక్ట్ పనులను చూసుకుంటాడు.
అయితే నిబంధనల ప్రకారం అతనికి 15 కోట్ల వరకు మాత్రమే బ్యాంక్ గ్యారెంటీ ఉంటుంది. కానీ అతడు అంతకు మించి క్రెడిట్ లిమిట్ పొందేలా ఫోర్జరీ సంతకాలతో నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాలను ఆయా కంపెనీలకు అందజేశాడు. ఆ సంస్థలు ఇచ్చినట్టు ఫోర్జరీ సంతకాలను సృష్టించి.. వారి నుంచి సామగ్రి సరఫరా చేయించుకున్నాడు. వాటితో యూబీఐ నుంచి రూ. 53 కోట్ల 18 లక్షల 50 వేల 93 రూపాయల వరకు క్రెడిట్ స్థాయి పెంచుకున్నాడు. బ్యాంకు పరిశీలనతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బ్యాంకు ఏజీఎం ప్రకాష్ బాబు మాదాపూర్ పోలీసులకు జూలైలో ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సారధ్యంలో విచారణ చేపట్టిన బృందం.. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసింది. ఇదే కేసులో నెక్కంటి శ్రీనివాస్ అనే వ్యక్తికి నోటీసులు జారీ చేసింది.