ప్రధాని మోడీ, అసోం ప్రభుతంపై గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ విమర్శలతో విరుచుకు పడ్డారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రధాని మోడీ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.
తనను తప్పుడు కేసులో ఇరికించడానికి ఒక మహిళను బీజేపీ నేతలు ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. ఈ కుట్రలో ప్రధాని కార్యాలయానికి ప్రమేయం ఉందన్నారు. అందుకు ఆయన్ని 56 అంగుళాల పిరికిపందగా పిలుస్తానని పేర్కొన్నారు.
తనకు బెయిల్ మంజూరు చేసే సమయంలో అసోం ప్రభుత్వంపై కోర్టు మండిపడిందన్నారు. దానికి కోర్టు వ్యాఖ్యలకు అసోం ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారంటూ జిగ్నేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో ఆయనకు బెయిల్ వచ్చిన కొద్ది క్షణాలకే ఆయనపై మరో కేసు నమోదైంది. మహిళా కానిస్టేబుల్ తో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ పోలీసులు ఆరోపించారు.