హిజాబ్ పై నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగిన విద్యార్థినిలపై అధికారులు చర్యలకు దిగారు. నిరసనల్లో పాల్గొన్న 58 మందిని సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తరగతి గదుల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలంటూ శివమొగ్గ పబ్లిక్ స్కూల్ ముందు కొందరు విద్యార్థినులు శుక్రవారం నిరసనకు దిగారు. ‘హిజాబ్ మా హక్కు. మేము చావనైనా చస్తాం కానీ హిజాబ్ ను వదులుకోం” అంటూ నినాదాలు చేశారు.
దీనిపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. విద్యార్థులపై సస్పెన్షన్ విధిస్తున్నట్టు తెలిపారు. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు వారిని తరగతుల్లోకి అనుమతించబోమని వెల్లడించారు.
మరోవైపు హిజాబ్ విషయంపై నిరసనలు చేస్తు నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన విద్యార్థులపై కర్ణాటక పోలీసులు కేసులు నమోదు చేశారు. తుముకూర్ లోని ప్రభుత్వ పీయూ కాలేజీ బయట హిజాబ్ రూల్స్ కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 17న నిరసనకు దిగిన 14 మంది బాలికలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.