ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని పలు ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో సుమారు 20 నుంచి 25 నగరాల్లో 5జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మొబైల్ డేటా ఛార్జీలు భారత్ లోనే తక్కువ అని అన్నారు. 5జీ విషయంలోనూ ఇతర దేశాలతో పోల్చితే దేశంలో రేట్లు తక్కువగా ఉండనున్నట్టు చెప్పారు.
విశ్వసనీయమైన నెట్ వర్క్ అందిస్తున్న ప్రొవైడర్ల జాబితాలో భారత దేశం పేరు అగ్రస్థానంలో ఉందన్నారు. ఇప్పుడు భారత్ అభివృద్ధి చేసిన సాంకేతికతపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.
భారత టెలికామ్ రంగంలో కొత్త శకానికి 5 జీ నాంది పలకనుందని తెలిపారు. 5 జీ తోపాటు రాబోయే 6 జీ టెక్నాలజీ రంగంలోనూ ఇండియా అగ్రదేశంగా ఆవిర్భవించే సమయం మరెంతో దూరంలో లేదన్నారు.