దక్షిణాదిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. దేశంలో ప్రారంభం అవుతున్న 5వ వందే భారత్ ట్రైన్ ఇది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పచ్చ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ వరకు నడుస్తుంది. ఇప్పుడు నవంబరు 10న దక్షిణాదిన 5వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఈ రైలు సేవలు అందించనుంది.
వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య 5వ వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. గత నెలలో మూడో వందే భారత్ రైలును మోడీ ప్రారంభించారు. గాంధీ నగర్, ముంబై మార్గంలో ఈ రైలు నడుస్తోంది. అయితే ఇది ప్రమాదానికి గురికావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే దీనికి రిపేర్ చేసి ట్రాక్ మీదకు తీసుకొచ్చారు.
మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ-వారణాసిల మధ్య, రెండో వందే భారత్ రైలును ఢిల్లీ- శ్రీ వైష్ణోదేవి మాతా-కట్రా మధ్య మోడీ ప్రారంభించారు. వందే భారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. ఈ రైలు కేవలం 140 సెకన్ల సమయంలో 160 కి.మీ. వేగం అందుకుంటుంది. దీపావళి నాటికి హైదరాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అత్యాధునిక వందే భారత్ రైళ్లను పూర్తిగా భారత్ లోనే తయారు చేస్తున్నారు. ఈ సెమీ, హై స్పీడ్ ట్రైన్లలో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. ఈ రైళ్లను తక్కువ విద్యుత్తు వినియోగించుకునేలా అభివృద్ధి చేస్తున్నారు. స్టీల్‌తో కాకుండా తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో వీటిని రూపొందిస్తున్నారు.