క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు తీరని శోకాన్ని మిగుల్చుతాయని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ ఘటన జరిగింది. భార్యభర్తల గొడవ పిల్లల్ని మింగేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే మహద్ తాలూకాలోని ఖరవలి గ్రామంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఐదుగురు ఆడపిల్లలు కాగా.. ఒకరు పిల్లాడు. అయితే.. భర్త తాగుడికి బానిస కావడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి.
రోజురోజుకీ అతడి ప్రవర్తన ఘోరంగా తయారవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. ఆగ్రహానికి గురైన మహిళ ఆరుగురు పిల్లలను బావి దగ్గరకు తీసుకెళ్లి అందులో పడేసి తర్వాత తాను కూడా దూకింది. ఇది గమనించిన స్థానికుడు బావిలోకి దూకి ఆమెను రక్షించాడు.
ఈ ఘటనలో తల్లి ప్రాణాలతో బయటపడినా.. ఆరుగురు పిల్లలు చనిపోయారు. పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే ఘటనాస్థలిని పరిశీలించారు. చనిపోయిన పిల్లల వయసు 18 నెలల నుంచి 10 ఏళ్ల లోపే ఉంటుంది.