పాకిస్తాన్ జైళ్లలో భారతీయ ఖైదీల మరణం పట్ల ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత 9 నెలల్లో ఆరుగురు ఖైదీలు మృతి చెందడం పట్ల ఆ దేశానికి నిరసన వ్యక్తం చేసింది. ఈ భారతీయ ఖైదీల శిక్షాకాలం ముగిసినప్పటికీ విడుదల చేయలేదని, చివరకు వారు జైల్లోనే మరణించారని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి తెలిపారు, వీరిలో అయిదుగురు మత్స్యకారులున్నారని, తమ దేశ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీల భద్రతపై పాక్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
అక్కడి భారతీయ ఖైదీలను తక్షణమే విడుదల చేసి, ఇండియాకు అప్పగించాలని ఆయన పాక్ ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా 536 మంది భారతీయ మత్స్యకారులు, ముగ్గురు పౌరులు తమ శిక్షా కాలాన్ని ముగించుకున్నారని, వారిని విడుదల చేయాలంటూ ఇదివరకే ఆ దేశ ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన చెప్పారు.
105 మంది మత్స్యకారులు, 20 మంది ఖైదీలకు కాన్సులర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. వీరు కూడా భారతీయులేనని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ చట్టాలను పాకిస్తాన్ గౌరవించదని, ముఖ్యంగా భారతీయల పట్ల ఆయా దేశానికి ఏ మాత్రం ఆదరణ లేదని నెటిజన్లు ట్వీట్లతో వెల్లువెత్తుతున్నారు. ఐరాస భద్రతామండలిలో ఎన్నిసార్లు పాక్ నిర్వాకాన్ని భారత్ ఎండగడుతున్నా.. ఆ దేశం తన తీరు మార్చుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.