జమ్ము కశ్మీర్‌లో జంట పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ యాత్ర, మరోవైపు రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో జంట పేలుళ్లు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నర్మాల్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
కేవలం 15 నిమిషాల వ్యవధిలో వెంట వెంటనే బాంబు పేలడంతో ఆందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఈ పేలుళ్లలో ఆరుగురు గాయపడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి.
రాహుల్‌గాంధీ జోడో యాత్ర కొనసాగే మార్గాల్లో వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాంబు పేలుళ్లకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియ రాలేదు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు, క్లూస్ టీమ్స్ చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నాయి.
పేలుళ్లు చోటు చేసుకున్నట్లు అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ ధృవీకరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. జమ్ముకు 60 కిలోమీటర్ల దూరంలో చద్వాల్ వద్ద భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. శీతాకాల విరామం అనంతరం శుక్రవారం యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ ఈ రోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు.
యాత్రను రేపు తిరిగి ప్రారంభించనున్నారు. జోడో యాత్రను జనవరి 30 నాటికి పూర్తి చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. భద్రతా పరమైన కారణాల రీత్యా యాత్రను ఏ మార్గంలో నిర్వహించాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ శ్రేణులు అధికారులకే విడిచిపెట్టాయి.