యూపీలోని అయోధ్యలో రామాలయ విగ్రహం తయారీకోసం నేపాల్ నుంచి అరుదైన శాలిగ్రామ శిలాఖండాలను తెప్పిస్తున్నారు. ఆ దేశంలోని కాళీ గందకి నది నుంచి సేకరించిన రెండు భారీ శిలల్లో ఒకటి 18 టన్నులు, మరొకటి 12 టన్నుల బరువు ఉండడం విశేషం. మొత్తం 30 టన్నుల బరువున్న వీటిని ట్రక్కుల్లో నేపాల్ నుంచి తీసుకువస్తున్నారు. ఆ దేశ మాజీ ఉప ప్రధాని బిమలేంద్ర, ఆయన అధికార బృందం ఈ శాలిగ్రామ శిలలను ఇండియాకు తీసుకువస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాముడి విగ్రహం తయారీకి ముందు వీటికి పూజలు చేయనున్నారని ఈ వర్గాలు వెల్లడించాయి. 4 అడుగుల వైశాల్యం, 5నుంచి 6 అడుగుల పొడవు గల ఈ శిలలను ప్రత్యేకమైనవి, విశిష్టమైనవిగా భావిస్తున్నారు. వీటిని మహావిష్ణు అవతారంగా పరిగణిస్తున్నామని, నేపాల్ లోని గందకి నదిలో మాత్రమే ఇవి కనిపిస్తాయని ఈ వర్గాలు వివరించాయి.
శాలిగ్రామాలను హిందువులు పరమ పవిత్రమైనవిగా భావిస్తున్న విషయాన్నీ ఇవి గుర్తు చేశాయి. ఇవి దాదాపు 6 లక్షల ఏళ్ళనాటివని చరిత్రకారులు విశ్లేషించారు.హిమాలయాల నుంచి గందకి నది వేగంగా పారుతున్న కారణంగా ఈ శాలిగ్రామ శిలలు 33 రకాల శిలాజాలుగా మారుతాయని కూడా వారు పేర్కొన్నారు.
పవిత్రమైన వీటిని దేశ వ్యాప్తంగా రాముడి విగ్రహాల తయారీలో వాడుతారని తెలుస్తోంది. వచ్చే ఏడాది మకర సంక్రాంతి నాటికి అయోధ్యలో రాముడి విగ్రహం తయారీ పూర్తి కావచ్చునని తెలుస్తోంది. అప్పుడే ప్రాణ ప్రతిష్ట వంటి కార్యక్రమాలను నిర్వహించే సూచనలున్నాయి. శాలిగ్రామ శిలలతో సీతమ్మ వారి విగ్రహం కూడా తయారు చేయనున్నట్టు అయోధ్య వర్గాలు వెల్లడించాయి.