వరుసగా ఆరు సార్లు పరిశుభ్రమైన నగరంగా రికార్డు సృష్టించిన ఇండోర్‌కు కాలుష్య కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల పర్యావరణ మంత్రిత్వ శాఖ 132 నగరాల్లో విశ్లేషణలు చేసింది. 2017నుంచి 2022 వరకు పీఎం 10 కాలుష్య స్థాయి పెరిగిన నగరాల జాబితాలను తయారు చేసింది.
అందులో టాప్ 30 నగరాల జాబితాలో ఇండోర్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే గత ఐదేండ్లలో ఇండోర్ నగరంలో కాలుష్య స్థాయి పెరుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తం మధ్యప్రదేశ్ లో ఏడు నగరాల్లో పీఎం 10 కాలుష్య స్థాయిపై విశ్లేషణలు చేశారు.
ఏడు నగరాలకు గాను ఆరు నగరాల్లో పీఎం 10 స్థాయి పెరిగిందని అధికారులు వెల్లడించారు. పీఎం 10 కన్నా స్థాయిని పెరిగినప్పుడు ఆ గాలిని పీల్చినప్పుడు అది ఊపిరితిత్తుల సమస్యలకు దారి తీస్తుందని, తద్వారా మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. చెత్త చెదారాల నిర్వహణ, ఇతర పరిశుభ్ర పద్దతులను ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్ లు ఇస్తుంటారు. అయితే వ్యర్థాల నిర్వహణ, వాయు కాలుష్య స్థాయిల విశ్లేషణలను ఒక దానితో పోల్చదగినవి కాదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ చెత్త, వాయు కాలుష్యాలను రెండింటి లక్ష్యంగా పరిశుభ్రత ఎలా ఉండాలనే అంశాన్ని ఈ విశ్లేషణలు చూపిస్తుందని అంటున్నారు.