జలపాతంలో జారి.. - six wild elephants drown after slipping off waterfall in thai park- Tolivelugu

జలపాతంలో జారి..

ఆరు గజరాజులు దిక్కుతోచని స్థితిలో కాసేపు అల్లల్లాడాయి. ప్రాణం కాపాడుకునేందుకు ఆఖరి క్షణం వరకు పోరాడుతూ దుర్మరణం పాలయ్యాయి. థాయ్‌లాండ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. అక్కడి ఏనుగుల గుంపు ఒకటి జాతీయ పార్క్‌లో విహరిస్తూ జలపాతంపై నుంచి లోయలోకి పడిపోయాయి. ఆరు ఏనుగులు మృత్యువాతపడ్డాయి. రెండు ఏనుగులను మాత్రం అటవీ అధికారులు రక్షించగలిగారు.

six wild elephants drown after slipping off waterfall in thai park, జలపాతంలో జారి..

six wild elephants drown after slipping off waterfall in thai park, జలపాతంలో జారి..

ఇక్కడున్న రెండు ఫోటోలు చూశారా.. అవి గజరాజుల జలక్రీడ కాదు, ప్రాణాల్ని కాపాడుకునే ప్రయత్నం. ఒక ఏనుగుల గుంపు అటవీ ప్రాంతంలో తిరుగుతూ ప్రమాదవశత్తూ జలపాతంలో జారిపోతూ కింద వున్న ప్రవాహంలో పడిపోయాయి.

ఈశాన్య థాయ్‌లాండ్‌ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ‘ఖోయోయాయి’ జాతీయ పార్క్‌లో ఒక్కసారిగా ఏనుగుల ఆర్తనాదాలు విని అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. హ్యూ నారోక్‌ జలపాతం దగ్గర ఆరు ఏనుగులు నీటిలో మునిగి విగత జీవులుగా పడి ఉండటం వారు గమనించారు.

కొండ అంచున చిక్కుకున్న మరో రెండు ఏనుగులను అధికారులు ఎంతో శ్రమపడి రక్షించారు. ఈ రెండు ఏనుగులు తోటి ఏనుగులు నీటిలో పడిపోతుండటం గమనించి వాటిని రక్షించేందుకు యత్నించి అక్కడ చిక్కుకున్నాయని గుర్తించారు.

ఆ ప్రాంతంలో అంతకుముందు రాత్రి భారీ వర్షం పడింది. దానివల్ల జారుడుగా వుండటంతో ఏనుగులు పట్టుతప్పి కిందికి పడిపోయాయని పార్క్‌ ప్రతినిధి చెబుతున్నారు.

ఏనుగుల మృతితో జలపాత సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు. ఏనుగు థాయ్‌లాండ్‌ దేశానికి జాతీయ జంతువు. ఆ దేశంలో ఏనుగుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp