యూపీ లోని హాపూర్ జిల్లాలో ఆరేళ్ళ బాలుడు బోరు బావిలో పడిపోయాడు. ఈ జిల్లా లోని కోట్ల సాదత్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈ బాలుడు ఆడుకుంటూ వెళ్లి 40 అడుగుల లోతున్న బోర్ వెల్ లో పడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఎన్ డీ ఆర్ ఎఫ్ సహాయక బృందాలు అతడ్ని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ ప్రాంతంలో నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం బోర్ వెల్ ని తవ్విందని, చాలాకాలంగా ఇది నిరుపయోగంగా ఉందని స్థానికులు తెలిపారు. అయితే నీటి సరఫరా మాట అటుంచి.. అధికారులెవ్వరూ ఇటు రాలేదని, దీన్ని పూడ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు చెప్పారు.
బాలుడు ఈ బోర్ వెల్ లో పడిన మాట నిజమేనని ధృవీకరించిన జిల్లా కలెక్టర్ మేధా రూపమ్ .. ఆ చిన్నారిని రక్షించే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ వెల్ లోకి ఆక్సిజన్ పంపిస్తున్నారని, బాలుడు సురక్షితంగా బయటపడతాడని ఆశిస్తున్నామని అన్నారు.
సుమారు 35 ఏళ్ళ క్రితం ఈ బోరు బావిని తవ్వారని అధికారవర్గాలు తెలిపాయి. మను అనే బాలుడు ఇందులో పడిపోయినట్టు గుర్తించారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖకు చెందిన సిబ్బంది కూడా ఇక్కడకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.