– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్
గత ఐదేండ్లలో 600 మంది కశ్మీరి పండిట్స్ కుటుంబాలకు చెందిన భూమిని తిరిగి వారికి అప్పగించినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో బుధవారం తెలిపారు. కశ్మీర్ లో వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
‘ జమ్ము, కశ్మీర్ ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం.. తమ భూమిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని 610 మంది కశ్మీర్ పండిట్లు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం స్పదించి వారి భూమిని వారికి అప్పగించింది” అని వెల్లడించారు.
‘ జమ్ము కశ్మీర్ వలస కార్మికుల స్థిరాస్తుల చట్టం-1997 ప్రకారం జమ్ము కశ్మీర్ లోని ఆయా జిల్లాల్లో వలస కార్మికుల స్థిరాస్తులకు సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్లు సంరక్షకులుగా ఉన్నారు. అలాంటి ఆస్తులను సంరక్షించేందుకు, వాటికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకునే విధంగా జిల్లా మెజిస్ట్రేట్లకు తదుపరి అధికారాలు ఇచ్చాము” అని తెలిపారు.
‘ కశ్మీర్ లోయలోకి తిరిగి వచ్చిన కశ్మీరి పండిట్స్ కు పునరావాసం కల్పించేందుకు పలు చర్యలు తీసుకున్నాము. అందులో భాగంగా 6000 వసతి గృహాలను నిర్మించేందుకు రూ. 920 కోట్లతో నిర్మించాము” అని తెలిపారు.
రాష్ట్రంలో వలస వచ్చిన వారికి మతపరమైన ఆస్తులు, స్థిరాస్తుల విషయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు పోర్టల్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పీఎం డెవలప్ మెంట్ ప్యాకేజీ -2015 కింద వారిలో 3000ల మందికి రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు.