మానవ మేధస్సు, సాంకేతిక, కేంద్రీకృత కార్యకలాపాల వల్ల జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గుతోందని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. జమ్ముకశ్మీర్ భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో గడిచిన ఏడాది కాలంలో 62 మంది ఉగ్రవాదులు హతమయ్యారని జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
చివరి మూడు నెలల్లో 32 మంది ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. హతమైన 62మందిలో 39 మంది లష్కరే తోయిబాకు, 15 మంది జైషే మహ్మద్‌కు, 6 మంది హిజ్బుల్ ముజాహిదీన్‌కు, ఇద్దరు అల్-బదర్కు చెందిన వారిగా గుర్తించినట్టు వెల్లడించారు.
వారిలో 47 మంది స్థానికులు కాగా.. 15 మంది విదేశీ ఉగ్రవాదులని వివరించారు. మరోవైపు పుల్వామాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కార్మికులు, స్థానికేతరులు, స్థానిక పౌరులపై దాడులు చేసినవారని ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
మరణించిన ఉగ్రవాదులను ఐజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్ గా గుర్తించినట్లు చెప్పారు. వీరిద్దరూ స్థానికులని వెల్లడించారు. అయితే వారు అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని తెలిపారు విజయ్ కుమార్.