ఎవరి దగ్గర అప్పు తీసుకుందాం… దాన్ని ఎట్ల ఎగవేసి పోదాం అని ఆలోచిస్తారు కొందరు. వేల కోట్ల కుంభకోణాలు చేసి… విదేశాలకు చెక్కేస్తారు మరికొందరు. కానీ.. ఎప్పుడో 53 ఏళ్ల క్రితం చేసిన అప్పును గుర్తుపెట్టుకొని.. అది తీర్చడానికి దేశాలు దాటి వచ్చాడో వ్యక్తి.. అప్పు అంటే ఏ లక్షల్లోనే.. కోట్లలోనే కాదు. రెండంకెల సంఖ్య మాత్రమే. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.
హర్యానా హిసార్ కు చెందిన ఉప్పల్ కు ప్రస్తుతం 68 ఏళ్లు. ఎప్పుడో టెన్త్ చదువుకునే రోజుల్లో ఓ కిరాణా షాప్ దగ్గర రూ.28 అప్పు చేశాడు. తరువాత అనుకోని కారణాలతో హిసార్ ను వదిలి వెళ్ళాడు. కానీ ఉన్న బాకీని మాత్రం మరిచిపోలేదు. ఆ తర్వాత నేవీలో ఉద్యోగం రావడంతో అటువైపు వెళ్లేందుకు కుదరలేదు. తర్వాత తన కుమారుడితో అమెరికాలో స్థిరపడ్డాడు. అయితే తాను చేసిన అప్పును ఎలాగైనా తీర్చాలని అనుకున్నాడు. తాజాగా హిసార్ కి వెళ్లాడు. అక్కడి యజమానిని కలిసి “నేను మీ తాతకు రూ.28 అప్పు ఉన్నాను. అది తిరిగి ఇవ్వడానికి వచ్చాను. వడ్డీతో కలిసి కలిపి రూ.10 వేల చిల్లర అయింది తీసుకో” అని డబ్బులు ఇచ్చాడు. దీంతో అందరూ షాకయ్యారు. ఆ తర్వాత తాను చదువుకున్న స్కూల్ కు వెళ్ళాడు ఉప్పల్. స్కూల్ మూసేసి ఉండడంతో నిరాశతో వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అతని నిజాయితీని అందరూ అభినందిస్తున్నారు.