పుదుచ్చేరిలో బీజేపీకి చెందిన సెంథిల్ కుమార్ అనే నేతపై ఆదివారం రాత్రి కొందరు దుండగులు దారుణంగా దాడి చేసి హతమార్చారు. . మోటార్ సైకిళ్లపై వచ్చిన ఏడుగురు వ్యక్తులు ఆయనపై మొదట రెండు నాటు బాంబులు విసిరి ఆయన కిందపడిపోగానే నరికి చంపారు. 45 ఏళ్ళ సెంథిల్ కుమార్ పుదుచ్చేరి హోం మంత్రి ఏ.నమశ్శివాయం బంధువు కూడా. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన ఓ బేకరీ వద్ద నిలబడి ఉండగా వీరు ఆయనపై దాడి చేసి పరారయ్యారు.
ఈ సమాచారం తెలియగానే దాదాపు 700 మంది బీజేపీ కార్యకర్తలు ఆ స్పాట్ కి చేరుకున్నారు. మంత్రి నమశ్శివాయం.. సెంథిల్ కుమార్ మృత దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు సెంథిల్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపి దర్యాప్తు ప్రారంభించారు.
సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు సెంథిల్ కుమార్ పై నాటు బాంబులు విసరడం స్పష్టంగా కనిపించింది. ఆ ప్రాంతంలోబాంబులు పేలడం వల్ల దట్టంగా పొగ అలముకొందని, అక్కడున్న వారిని దుండగులు కర్రలతో కొట్టి పంపేశారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
మంగళం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న సెంథిల్ కుమార్.. రియల్ ఎస్టేట్, ఇతర బిజినెస్ వ్యవహారాలు కూడా నడిపేవాడని పోలీసులు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దారుణ హత్య పుదుచ్చేరిలో తీవ్ర సంచలనం సృష్టించింది.