మరో నీరవ్ మోదీ.. గ్రాడ్యుయేట్లనూ ముంచాడు

పంజాబ్ నేషనల్ బ్యాంకు ముంబై బ్రాంచికి రూ. 11,400 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి పరారైన డైమండ్ మర్చంట్ నీరవ్ మోదీ బంధువు మెహుల్ చోక్సీ కూడా తక్కువైనవాడేమీ కాదు. ఏడుగురు యువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇతగాడు టోకరా ఇచ్చిన వైనం బయటపడింది. జైపూర్ లో.. రాజస్తాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన ఈ ఏడుగురూ గత రెండేళ్లుగా ఇతనిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ వైభవ్ ఖురానియా (24), ఐటీ ఇంజనీర్ దీపక్ బన్సాల్ (25) సహా మరో ఐదుగురు గ్రాడ్యుయేట్లు తమ తలిదండ్రులను అడిగో, తమ ఫ్రెండ్స్ నుంచి అప్పు తెచ్చుకునో సుమారు 3 కోట్లు సేకరించి..ఆర్ఎం గ్రీన్ సొల్యూషన్స్ పేరిట ఢిల్లీలో గీతాంజలి జువెల్లర్ రీటైల్ ఫ్రాంచైజీ తీసుకున్నారు.

ఈ సంస్థ ద్వారా తమ భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకోవచ్చునని ఎంతో ఆశించారు. అయితే వారి కలలు కొన్నాళ్ళకే కల్లలయ్యాయి. రూ. 1.5 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ పెట్టిన వీరికి నాసిరకం, థర్డ్ గ్రేడ్ డైమండ్స్, జెమ్స్ అందాయి. అసలు విషయం తెలిసేసరికే అప్పటికే ఆలస్యమైంది. ఈ డైమండ్స్, జెమ్స్ వ్యాపారం కుంటు పడింది. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించి మెహుల్ చోక్సీపై సాకేత్ కోర్టులో కేసు పెట్టారు. వీరి పిటిషన్ ను విచారించిన కోర్టు.. చోక్సీ మీద ఆరోపణలు నిజమేనని తేలితే అతడ్ని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు చోక్సీ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అయితే అమాయకులైన వీరిని ఎదురు దెబ్బ తీసేందుకు చోక్సీ ఢిల్లీ హైకోర్టుకెక్కాడు. తనపై దాఖలైన ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేయాలని కోరుతూ గత ఏడాది ఆగస్టులో పిటిషన్ వేశాడు. ఇది విచారణ దశలో ఉంది.