యూపీలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బరేలి జిల్లాలో ట్రక్కును అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం….
పిలిబిత్ కు చెందిన ఓ కుటుంబం మెడికల్ చెకప్ కోసం ఢిల్లీకి వెళ్లింది. మెడికల్ చెకప్ పూర్తయ్యాక స్వగ్రామానికి అంబులెన్స్ లో బయలు దేరారు. ఈ క్రమంలో ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.
మొదట అంబులెన్స్ డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో అంబులెన్స్ అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టింది. అంబులెన్స్ లో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులు, డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ట్రక్కులో ఉన్న వారికి గాయాలయ్యాయి.
ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.