బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ పై ఢిల్లీ వర్సిటీలో చోటు చేసుకున్న రగడపై విచారణకు వర్సిటీ ఆదేశించింది. ఈ మేరకు ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీని వర్సిటీ నియమించింది. ఈ కమిటీకి రజినీ అబ్బి చైర్మన్ గా వ్యవహరించనున్నారు.
ఘటనపై ఈ నెల 30న సాయంత్రం 5 గంటల్లోగా వైస్ ఛాన్స్ లర్ యోగేశ్ సింగ్ కు నివేదిక ఇవ్వాలని కమిటీని అధికారులు ఆదేశించారు. క్యాంపస్‌లో క్రమశిక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం వైస్-ఛాన్సలర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఈ కమిటీలో ప్రొఫెసర్లు అజయ్ కుమార్ సింగ్, మనోజ్ కుమార్ సింగ్, సంజయ్ రాయ్, రమ, దినేశ్ ఖట్టర్, గాజేసింగ్ లు సభ్యులుగా ఉన్నారు. ప్రధాని మోడీపై ఇటీవల బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తీవ్ర దుమారం రేగుతోంది.
ఈ క్రమంలో డాక్యుమెంటరీని ఢిల్లీ వర్సిటీలో ప్రదర్శించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేశాయి. దీంతో పోలీసులు వర్సిటీకి చేరుకొని పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనలు జరిగాయి.