భారత-చైనా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద భద్రతను పటిష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కొత్తగా 7 బెటాలియన్లను మోహరిస్తున్నారు. 9,400 మంది జవాన్లతో బాటు మరో ఆపరేషనల్ బేస్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించిందని వారు తెలిపారు.
వాస్తవాధీన రేఖ వద్ద 47 కొత్త బోర్డర్ పోస్టులను గస్తీ కాసేందుకు ఈ బెటాలియన్లను వినియోగించుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే సుమారు డజను ‘స్టేజింగ్ క్యాంప్’ లు, కొన్ని స్థావరాల పరిరక్షణ కూడా వీరి బాధ్యతగా ఉంటుందని పేర్కొన్నాయి.
2020 నుంచి భారత, చైనా దేశాల మధ్య ఏదో ఒక సందర్బంలో ఉద్రిక్తతలు రేగుతూనే ఉన్నాయి. 1962 లో చైనాతో యుద్ధం తరువాత ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ కు చెందిన సుమారు 90 వేలమంది సైనిక సిబ్బందిని ఇక్కడ నియమించారు.
3,488 కి.మీ. పొడవునా గల నియంత్రణ రేఖ వద్ద వీరు అనుక్షణం కాపలాగా ఉంటున్నారని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. అయితే ఇటీవలి కాలంలో చైనా దళాలు అక్రమంగా ఇక్కడ టెంట్లు, కట్టడాలు నిర్మించడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ఉద్దేశించి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చైనాకు చెక్ పెట్టవచ్చునని భావిస్తున్నారు