టర్కీ, సిరియా దేశాలను కుదిపివేసిన భూకంపం వేల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఎటు చూసినా మృతదేహాలు, శిథిలాల గుట్టలు.. నేలమట్టమైన శిథిలాల కింద గాయపడి లేవలేని స్థితిలో వేలమంది.. ఇంతటి ఘోర విపత్తులోనూ ప్రాణాలు దక్కించుకున్న అదృష్టవంతులూ ఉన్నారు.
సిరియాలో ఓ భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన ఏడేళ్ల బాలిక తన చిన్నారి తమ్ముడికి రక్షణగా అతడి తలపై చెయ్యి పెట్టి కాపాడుతున్నట్టుగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఆ చిన్నారి 17 గంటల పాటు గడిపిందట. సహాయక బృందాలు అతి కష్టం మీద ఆ చిన్నారులిద్దరినీ బయటకు తీసి రక్షించారు.
ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహమ్మద్ సఫా.. ఈ వీడియోను, ఇలాంటి మరికొన్ని దయనీయమైన వీడియోలను షేర్ చేశారు. తన చిట్టి తమ్ముడి రక్షణ కోసం ఈ బాలిక ఎంత తపన పడిందో ఈ వీడియో చూస్తే తెలుస్తోందన్నారు. అయితే ఈమె కుటుంబం జాడ మాత్రం తెలియడంలేదని ఆయన ట్వీట్ చేశారు.
ఇది చూసి తన హృదయం ద్రవించిపోయిందన్నారు. మరో చోట ఇలాగే శిథిలాల కింద 37 గంటలుగా చిక్కుకుపోయిన 5 ఏళ్ళ బాలికను రక్షణ బృందాలు రక్షించాయి. విపరీతమైన చలి, శీతల వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ బృందాలు చేస్తున్న సాయాన్ని ఎలా పిలవాలని ఆయన వ్యథార్థ హృదయంతో వ్యాఖ్యానించాడు.