ఉక్రెయిన్- రష్యా యుద్ధం 53వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి తన బలగాలను రష్యా ఇటీవల ఉపసంహరించుకుంది. ఇక అప్పటి నుంచి రష్యా మరింత ఆగ్రహంగా కనిపిస్తోంది. మరియాపోల్, డొనెట్ స్క్, లుహనస్క్ లాంటి నగరాలపై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపిస్తోంది.
తాజాగా ఉక్రెయిన్‌లోని సెవెరోడ్‌నెట్స్క్‌పై రష్యా బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో నాలుగు ఆకాశహర్మ్యాలు అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రికి రాత్రే రష్యా క్షిపణి దాడులు చేసిందని లుహాన్స్క్ గవర్నర్ తెలిపారు.
ఇక మరో నగరం ఇర్పిన్ పై క్షిపణి దాడులతో రష్యా విరుచుకు పడుతోంది. నగరంలోని 71 శాతం భవనాలు ఇప్పటికే రష్యా దాడుల్లో ధ్వంసమయ్యాయని ఇర్పిన్ మేయర్ అలెగ్జాండర్ మర్కుషిన్ తెలిపారు. సుమారు 1000 భవనాలకు నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు.
115 భవనాలు పూర్తిగా నేల మట్టం అయ్యాయని చెప్పారు. ఇక ఇప్పటి వరకు యుద్ధంలో 20,300 రష్యన్ సైనికులు మరణించినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. రష్యాకు చెందిన 165 యుద్ధ విమానాలు, 146 హెలికాప్టర్లు, 773 యుద్ధ ట్యాంకులను నాశనం చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది.