బండ రావిరాల, చిన్న రావిరాల భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ తలపెట్టిన 72 గంటల దీక్షను వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆయా గ్రామాల్లో 209 మంది భూ నిర్వాసితులు ఉన్నారని ఆయన తెలిపారు.
వారంతా 14 ఏండ్ల క్రితం ప్రభుత్వానికి భూములు అప్పగించారని అన్నారు. 2015లో మంత్రి కేటీఆర్ అక్కడకు వచ్చి మైనింగ్ జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు నెల రోజుల్లో పరిహారం ఇప్పిస్తామని మంత్రి చెప్పారని ఆయన చెప్పారు.
ఇప్పటికి ఏడేండ్లు అవుతోందని, కానీ ఎలాంటి పరిహారమూ ఇప్పించలేదన్నారు. వారికి న్యాయం చేపట్టాలని 72 గంటల నిరాహార దీక్షను చేపట్టాలని అనుకున్నామన్నారు. కలెక్టర్‌తో మాట్లాడితే అక్కడ కేవలం 50 మందికి మాత్రమే పట్టాలు ఉన్నాయని అన్నారని పేర్కొన్నారు.
అందువల్ల మిగతా వారికి తర్వాత పరిహారం విషయం తర్వాత చూస్తామని పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. అలా కుదరదని తాను చెప్పడంతో దానికి కాస్త సమయమివ్వాలని కలెక్టర్ కోరారన్నారు. దీంతో 72 గంటల దీక్షను పోస్ట్ పోన్ చేసుకున్నారు. మొత్తం 209 మందికి ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారమే పరిహారం కట్టివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
చెక్కులతో పాటు ముచ్చర్ల ఫార్మాసిటీ నిర్వాసితులకు ఇప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. ప్రతి కుటుంబానికి ఫ్టాట్, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని అన్నారు. లేదంటే దసరా తర్వాత దీక్ష చేపడుతామని ఆయన డిమాండ్ చేశారు.